
హాలియా, వెలుగు : పార్టీలకతీతంగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుమలగిరి (సాగర్) మండలం చిల్కాపురం గ్రామంలో 121 మంది పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి హోంమంత్రిగా ఉన్న సమయంలో చిలకాపురంలో నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు మూడున్నర ఎకరాల ప్రభుత్వం భూమిని సేకరించామని తెలిపారు.
కానీ గత బీఆర్ఎస్ పాలనలో ఒకరి కూడా ఇండ్ల పట్టా ఇవ్వలేదన్నారు. త్వరలోనే కొంపెల్లి, బోయగూడెం, రాజవరం గ్రామాల్లో పేదలకు ఇండ్ల పట్టాలు ఇస్తామన్నారు. ప్రతి పేదవాడికి గూడు ఉండాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ గతంలో ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు. ఇప్పుడు ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీతోపాటు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని స్థానిక నాయకులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ యాదవ్, మాజీ ఎంపీపీ భగవాన్ నాయక్, మండల అధ్యక్షుడు కృష్ణ నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.